Sunday, April 29, 2007

38.స్కిన్‍లెస్

’వెధవా, ఇడియట్,స్టుపిడ్, రాస్కెల్..’ అంటూ కొత్తగా తిట్టడం నేర్చుకుంది
రంగారావు పెంచుకుంటున్న మాట్లాడే చిలుక.

దాన్నెలాగైనా దారిలోకి తేవాలని తిండి పెట్టడం మానేసాడు రంగారావు.
అయినా అది తిట్లు మానలేదు.

దాంతో ఒక రోజు తిక్కరేగి ఆ చిలకను తీసుకెళ్ళి ఫ్రిజ్‍లో పెట్టాడు. చలికి
తట్టుకోలేక అప్పుడైనా తన మాట వింటుందని.

కాసేపటికి చిలుక అరుపులు వినిపించి ఫ్రిజ్ తలుపులు తీశాడు.
’నీకు దణ్ణం పెడతాను. నన్ను బయటకు తియ్యి. ఇక జన్మలో నిన్ను
తిట్టను. సరేగాని... అన్ని మాటలన్నా నన్ను తిట్టకుండా కొట్టకుండా
లోపల పెట్టావు కదా! ఆ కోడి నిన్ను ఏమని తిట్టింది...ఈకలు వలిచి మరీ
లోపల పెట్టావు’ అసక్తిగా అడిగింది లోపలున్న చికెన్‍ను చూపిస్తూ.

37.మేధావి

"మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో ఓ కాగితం మీద రాయండి"
అని టీచర్ చెప్పింది.

కలెక్టర్, ఇంజనీర్, డాక్టర్ ఇలా ఎవరికి తోచింది వారు రాస్తున్నారు.

"ష్, " చిన్నగా సంధ్యను పిలిచాడు కిట్టు.

"ఏంటి?" అడిగింది సంధ్య.

"మేధావిలో ’ధ’కు మధ్యలో చుక్క ఉంటుందా?"

Saturday, April 21, 2007

36. స్నేహం

ఒక వ్యక్తి రోజు బార్‌కి వచ్చి రోజు మూడు పెగ్గులు విడివిడి గ్లాసులలో పోసుకుని
తాగుతున్నాడు. ఇది చూసి అక్కడి వెయిటర్ ఒక రోజు అడిగాడు..

" సార్! మీరు రోజూ మూడు పెగ్గులు ఇలా విడివిడి గ్లాసులలో ఎందుకు
తాగుతున్నారు.ఒకే గ్లాసులో తాగొచ్చుగా?"

"తాగొచ్చు. కాని దీనికొక కథ ఉంది! నేను, రమేష్, కిరణ్ ముగ్గురం
ప్రాణస్నేహితులం. కలిసి చదువుకున్నాం.రోజు కలిసి మందు కొట్టేవాళ్ళం.
కాని రమేష్ ఇప్పుడు అమెరికాలో, కిరణ్ డిల్లీలో ఉన్నారు. ఆ అలవాటు
తప్పకుండా వాళ్ళను గుర్తుచేసుకుంటూ మూడు పెగ్గులు తాగుతున్నాను.
ఒకటి నాది మిగాతా రెండూ వాళ్ళవి అన్నమాట."

"ఓ మీరు నిజంగా గ్రేట్ సార్"

ఒక రోజు అతడు రెండు పెగ్గులు మాత్రమే తెప్పించుకున్నాడు. అలా వారం
చూసి వెయిటర్ అడిగాడు.

"సార్! ఎమైంది మీ స్నేహితులలో ఎవరైనా చనిపోయారా?"

"లేదు. డాక్టర్ నన్ను తాగొద్దన్నారు"

Tuesday, April 17, 2007

35. చెప్పలేనండి

’ఆ టీవీ’వాళ్ళు రోడ్డు మీద ఇంటర్వ్యూ చేస్తూ అటు రోడ్డు మీద చిన్న సంచీ
పట్తుకుని వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి----


"మీకు’ ఆ టీ వీ’ అంటే ఇష్టమా లేక ’కీ టీ వీ’ అంటే ఇష్టమా?" అన్నారు
జవాబు చెప్పమని ఎంకరేజ్ చేస్తూ.

"చెప్పడం కష్టమండీ"

"పోనీ ఇది చెప్పండి.. మీకు హిందీ ప్రోగ్రాములు నచ్చుతాయా లేక మన
తెలుగు ప్రోగ్రాములు నచ్చుతాయా?"

"చెప్పలేనండి. చాలా కష్టం"

"ఎందువల్ల?" అడిగింది ఆ యాంకర్ బలవంతంగా నవ్వేస్తూ.

"నాకు టీ వీ లేదండి. పోనీ ఎక్కడైనా చూద్దామంటే మా ఊళ్ళో అసలు
కరెంటే లేదు".

Monday, April 16, 2007

౩౪. కావచ్చు

ఆ రోజు క్లబ్‍లో తన ఉపన్యాసం ముగిస్తూ "మీరెవరైనా ప్రశ్నలడగదలచుకుంటే
అడగండి " అన్నాడు.


ఒకడు లేచి " సార్! మీరు కష్టపడి బాగా డబ్బు సంపాదించి, ఆ డబ్బుని
పొదుపుగా ఖర్చుపెడుతూ జీవితంలో పైకొచ్చేనన్నారుకదా. మరి మీకంత
డబ్బుంది కదా! ఎప్పుడైనా విచ్చలవిడిగా ఖర్చుపెట్టి లైఫ్ ఎంజాయ్ చేద్దామని
అనిపించలేదా?" అన్నాడు


"అనిపించేది, కాని ఖర్చు పెట్టే ముందు నేను నాలుగు ప్రశ్నలు మనసులో
వేసుకునేవాడిని. మొదట ఏదైనా వస్తువుని చూసినప్పుడు ’ ఇది నిజంగా
నాకు కావాలా ’ అని అనుకునేవాడిని. ’అవసరం’ అని అనుకునేవాడిని.
రెండోది ’ ఇది నాకు నిజంగా అవసరమా ’ అని అనుకునేవాడిని.
’అవసరమే’ అనిపించేది. మూడోది ’సరే, కాని నీకు అది నీకు కొనే స్థోమత
వుందా?’ అని ప్రశ్నించుకునేవాడిని. ’ఉంది అనుకుంటా’ అనుకునేవాడిని.
ఆఖర్ని నాలుగోప్రశ్న ’ఇది లేకుండా నీకు గడుస్తుందా?’ అని ప్రశ్నించు
కునేవాడిని. దీనికి సరియైన జవాబు మనం ఇచ్చుకోగలిగితే, జీవితంలో
నా అంతవాడు కావచ్చు."

Thursday, April 12, 2007

33. నటురె - పుటురె

ఇంగ్లీషు క్లాసులో రాము లేచి " మాస్టారూ! నటురె అంటె అర్ధం
ఏంటండి?" అని అడిగాడు.

మాస్టారికి అర్ధం కాలేదు. " నటురెనా.....అదేం పదం? ’" అని
అడిగాడు. మాస్టారికి కూడా తెలియని పదాన్ని గురించి తను
అడుగుతున్నానని రాముకు గర్వంగా అనిపించింది. "అదే
మాస్టారూ...ఎన్...ఎ...టి...యు...ఆర్...ఇ " అన్నాడు.

మాస్టారికి కోపం వచ్చింది. "వెధవాయ్! ఆ పాఠం నేను నెల రోజుల
నుండి చెబుతున్నాను. అయినా దాన్ని సరిగ్గా ఎలా పలకాలో
నీకు తెలియలేదా? దాన్ని నేచర్ అని పలకాలి. ఆ మాత్రం
తెలియనివాడివి నా క్లాసులో ఉండకు. పో... ఇంకో వారం దాకా
నా క్లాసులో కనిపించకు పో..." అని అరిచాడు.

రాము ఇంటికి వెళ్ళి తండ్రి సోముకు జరిగినది చెప్పి ఏడ్చాడు.
సోము మాస్టారితో మాట్లాడతానని చెప్పి కొడుకుని ఓదార్చాడు.
మర్నాడు బడికి వెళ్ళి ఇంగ్లీషు మాస్టారిని కలిశాడు సోము
"మాస్టారూ! వారం రోజులు మావాడు ఇంగ్లీషు పాఠాలు వినకపోతే
వాడి పుటురె దెబ్బ తింటుంది కదా?" అన్నాడు.

అంతే మాస్టారి కోపం నషాలానికెక్కింది. "పుటురెనా?.. అదేంటి?.."
అన్నాడు. సోము అన్నాడు " అదే మాస్టారు!
ఎఫ్...యు...టు...యు...ఆర్...ఇ...ఇది కూడా తెలీదా మీకు?"

మాస్టారు "?????????????????"