Monday, July 16, 2007

52. ఎగ్జిబిషన్

ప్రతి సంవత్సరం భర్తతో ఎగ్జిబిషన్ కి వెళ్ళె అలవాటున్న భార్య, ఆ సంవత్సరం భర్త కాంపుకు వెళ్ళడముతో, ప్రేమతో వుత్తరం వ్రాసింది...

ప్రియ మైన శ్రీవారికి,

మీకు గుర్తుందా?....2000 సంవత్సరములో మీరు నేను మొదటి సారిగా విజయవాడ ఎగ్జిబిషన్లో మొదటి చూపులు చూపులు చూసుకున్నాము..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కలిగాయి యదలో ఎన్నేన్నో కలలు..కానీ స్నేహితుల ముందు చులకన కావడము ఇష్టం లేక...ఎవరీ పోకిరీ అని అన్నాను...మిమ్మల్ని పోకిరీ అన్నదానికి..నామనస్సు ఎంత బాధ పడిందో నాకు తెలుసు..

తుపాకీతో బెలూన్లను నేను కాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు వచ్చి మాట్లాడానికి ప్రయత్నము చేస్తే.. మీరు తడబడుతూ మాట్లాడడము చూసి మీకు నత్తేమో అని కొంచెము సేపు షాక్ అయ్యాను...తరువాత మీరు మామూలుగా మాట్లాడడము చూసి..ఊపిరి పీల్చుకున్నాను... కానీ మీ నత్తి మీద నా స్నేహితులు జోకులు వేస్తుంటే ఎంత కోపంవచ్చిందో..ఆ ఎత్తుపళ్ళ రోజా తో తగువు కూడా పెట్టుకున్నాను. ఇప్పటికీ కాఫీ పొడికి కోసం ఇంటికి వచ్చినా నిడుకుంది అనే చెబుతున్నాను.

స్టీలు గిన్నెల కొట్టు దగ్గర నేను కాలు తడబడి మీ మీద పడటము, మీరు చిరునవ్వుతో నన్ను మీ హృదయానికి హత్తుకోవటము..ఆ పారవశ్యములో మీరు నన్ను ప్రేమిస్తున్నాని చెబితే నేనుకూడా అని చెప్పటము..ఇంకా నిన్ననే జరిగినట్లు ఉంది...

జయింటు వీలు ఎక్కుదాము అని మీరంటే., అమ్మో నాకు భయము అని చెప్పటము (ధీరులైన మీరు దగ్గర ఉండగా) నాకు ఈరోజుకు కూడా సిగ్గెస్తోంది..మీకు ఇష్టమైన ఆ జయింటు వీలు నాకోసం ఎక్కకుండా త్యాగం చేసినందుకు..చాలా ముచట వేసింది.

ప్రతి సంవత్సరము ఆ అనుభూతులను మీతో ఎగ్జిబిషన్లో పంచుకుంటుంటే నా ఆనందం చెప్పనలవి కాదు...ఇప్పుడుకూడా ఎగ్జిబిషన్ వచ్చింది...ఎంతతొందరగా వస్తే అంత ఆనందము గా ఉంటుంది...

ఇట్లు
మీ పాద దాసి
రాధ.



జవాబు:

రాధకి,

ఎగ్జిబిషన్ కి రావటం కుదరదు...ఎగ్జిబిషన్ వలన ఎన్ని నష్టాలు ఉంటాయో తెలుసుకున్నాను...ఐనా ఎప్పుడు పాత కొట్లు, అదే జైంట్ వీలు ఉంటాయి...ఎగ్జిబిషనంటే చిరాకు, ఏవగింపు కలిగాయి, కాన నేను రాను..

గోపాళం




రచన : శ్రీ రమణ, రంగుల రాట్నం , నవోదయ పబ్లిషర్సు
స్వేచ్చానువాదం : అనీల్ చీమలమఱ్ఱి

(రచయితకు, పబ్లిషర్సు కు క్షమాపణలతో)